సెర్చ్

Friday, 16 April 2021

నా సమస్యాపూరణములు

                         🌷సమస్యాపూరణములు 🌷

🌼సమస్యాపూరణము అనే అంశం నేటి అవధానాల్లోనే కాక పూర్వకవుల చరిత్రలలోను చూడవచ్చు ఈ అంశము శ్రీరామనవమి నాడు పండితుల కాలక్షేపంగాను ఉండేది.
🌼అసలు సమస్య అంటే ఏమిటి..? సమస్య అంటే ఒక పద్యపాదం దాన్ని కవి లేక అవధాని అందులోని అస్పష్టతను,
తప్పుడు అర్థాన్ని మిగిలిన పద్యపాదములు పూరించడం ద్వారా తొలగించాలి అందులో చాలా రాకములుగా పూరింపవచ్చు ఎలాగంటే...,పదములకు ఒక అక్షరమునో లేక వేరు పదమునో జోడించడం, పదముకు నానార్ధం వెతకడం, లేక ఆ పాదాన్నే సమర్థించడం వంటివి, క్రమాలంకారం, విరుపు వంటివి చేయొచ్చు..

ఆ విధంగానే శంకరాభరణం బ్లాగు వారి సహకారంతో నేను చేసిన కొన్ని సమస్యాపూరణములు

🌼
1)స్వర్గము నందున్న దుర్యోధనుని చూసి ధర్మరాజు ఇలా అనుకొన్నాడు 
సమస్య :దుష్కృత మాచరించు కడు దుష్టున, కబ్బు నితాంత పుణ్యముల్ 

ముష్కరుడై సభాస్థలినిబుణ్యసతిన్ బడద్రోసినాడుగా 
పుష్కర కాలమున్ సకులపుత్రుల సానువుకంపినట్టి యీ 
ముష్కరుడిట్లునాకమున మున్గుచునుండె నిదేమిచోద్యమో 
దుష్కృత మాచరించు కడు దుష్టున, కబ్బు నితాంత పుణ్యముల్

సమస్య : నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

పూరణ : మేఘనాధుడి పై యుద్ధముకు బయలుదేరిన లక్ష్మణుణ్ణి ఆశీర్వాదిస్తున్న రాముడు
శా ||
భద్రమ్ముల్ శుభముల్ మహామునులు భవ్యమ్మౌగతిన్ జూపుగాన్
సద్రాజుల్ మనపూర్వులున్ బొసఁగు తా శౌర్యమ్ము, నాతండు యే
క్షుద్రక్రీడను సైచినన్ సుగుణి యో !కోదండ భాస్వంత! ని
ర్నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా


సమస్య :దసరా సరదాలు మనకుఁ దప్పెఁ గటకటా!

ప్రహ్లాదుని గురువులు చండామార్కులు హిరణ్యకశ్యపుని సభలోకి వెళుతున్నప్పుడు వారి సంభాషణ
కం.
"పసగలిగిన చదువుచదివ
క, సౌరినిగొలిచి దహరుడు కరగపడగ, రా
క్షసజనపాలుడు గనె "ఛాం
దస" రా...! సరదాలు మనకుఁ దప్పెఁ గటకటా!

కరగపడు = చెడిపోవు
దహరుడు = బాలుడు (ప్రహ్లాదుడు)

సమస్య : దారము లేనట్టి పూలదండయె మేలౌ

సూరివరేణ్యులు మెచ్చగ
వారిమెడ నలంకరింప వరలెడు మాలన్
కూరిమిని నెట్టి "చెత్త చె
దారము" లేనట్టి పూలదండయె మేలౌ

సమస్య : భారతరణరంగమందుఁ బార్థుం డోడెన్
ఒక రాజుకు వేదాంతమును బోధిస్తూ గురువు..

కం.
భారత రణాంగణమ్మున
వీరుండే కాని మోక్ష విజ్ఞానంబున్
జీరక నిహమను "భూసం
భార...! తరణరంగమందుఁ బార్థుం డోడెన్

భూసంభార = రాజ్యమును చక్కగా వహించేవాడు (రాజు)
గీతాసారము తెలిసిన వాడు ఐనప్పటికీ మోక్షము కోరి కన్నప్పగా జన్మనెత్తవలసిందికదా..

సమస్య :భారత యుద్ధరంగమునఁ బార్థుఁడుపొందెఁ బరాజయమ్మయో
చేరి సహోదరుల్ రణము సేసిన భూమది నెద్ది? బుద్ధి నే
పారగ ద్రోణు మానసము బాళి యొనర్చిన శిష్యుడెవ్వడో?
కోరుచు నన్యసంపదల, గోమలి బొచ్చిన వాడు నేమయన్?
భారత యుద్ధరంగమునఁ....., బార్థుఁడు...., పొందెఁ బరాజయమ్మయో

సమస్య :ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె
తే.గి.
"రాజు గావలె నన్న నీ మోజు నిష్ప
లమ్ము "నమ్మిన యాశల వమ్ము సేసి
నావు "యనిదిట్ట భీతిల్లి ప్రావు గోరి
ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె

వాలి = వాలము గలిగినది (వానరము)

సమస్య : గాజులు గల్లనఁగ, నరుఁడు గాండివ మెత్తెన్

కం.
ఆజిన్ బాండుకుమారులు
తేజము జూపంగ రుధిర తిలకము బెట్టెన్
సాజముగ ద్రౌపదీసతి
గాజులు గల్లనఁగ, నరుఁడు గాండివ మెత్తెన్

                              🌸  🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌸





No comments:

Post a Comment